అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చరణ్

మొన్నటివరకు టాలీవుడ్ లో హీరోగా కొనసాగిన నవదీప్ కు ప్రస్తుతం హీరోగా అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో సైడ్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ ‘బాద్షా’ సినిమాలో కీలక పాత్రలో నటించిన నవదీప్, ఈసారి రాంచరణ్ తో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నాడు.

బ్రూస్ లీ తర్వాత రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధృవ’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్ ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ వర్షన్ లో విలన్ గా నటించిన అరవింద్ స్వామి తెలుగులో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ సినిమాలో నవదీప్ కూడా నటించనున్నాడు. ఈ విషయాన్ని నవదీప్ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో తన పాత్ర ఎంటనేది మాత్రం చెప్పలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో చరణ్ తో పాటు వుండే నలుగురు స్నేహితులలో నవదీప్ ఒకరని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.