జక్కన్నకు అక్కినేని పురస్కారం..!

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం చేయనున్నామని ఏఎన్నార్ జాతీయ పురస్కార కమిటీ చైర్మన్ టి సుబ్బిరామి రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 17న జరగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారం అందించనున్నారు. ఈ మేరకు టీఎస్ఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

టీఎస్ఆర్ మాట్లాడుతూ.. 'అక్కినేని మరణించినా అందరిలో జీవించి ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ పురస్కారం ఏర్పాటు చేశాం. దీనికోసం కోటి మేర శాశ్వత నిధిని ఏర్పాటు చేశాం. దీనిపై వచ్చే వడ్డీ ఆధారంగా పురస్కారాన్ని అందిస్తున్నాం. ఇలా ఇప్పటివరకు దేవానంద్, షబానా ఆజ్మీ, వైజయంతి మాల, అంజలీదేవి, లతా మంగేష్కర్, బాల్ చందర్, హేమ మాలిని, శ్యామ్ బెనగల్, అమితాబ్ వంటి దిగ్గజాలు అక్కినేని అవార్డును అందుకున్నారు. ఈసారి బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఎంపిక చేశాం. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం నిర్వహించి అవార్డు అందిస్తాం' అని చెప్పారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ' అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన వారికి అవార్డు అందించడం, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా ఏర్పాటు చేసి సేవలు అందించడం అనేవి అక్కినేని నాగేశ్వర రావు గారి కల. బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఖ్యాతి విస్తరించేలా ఎస్ఎస్ రాజమౌళి కృషి చేశారు. అందుకే ఆయనకు ఈ అవార్డు అందించనున్నాం. కొన్నేళ్ళ క్రితం ఆరంభమైన ఎఐఎస్‌ఎఫ్‌ఎం స్కూల్‌ లో ఇప్పుడు ఏకంగా వందమంది విద్యార్థులు పట్టభద్రులు అవుతున్నారు. వారికి కూడా ఇదే వేదికపై డిగ్రీలను అందజేస్తాం' అన్నారు. అలాగే అక్కినేని అమల కూడా మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వర్రావు గారి కల నెరవేరే విధంగా ఈ ఇనిస్టిట్యూట్ నిర్మించామన్నారు. మొదట 60 మందితో ఆరంభమై ఇప్పుడు పలు దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చి చేరుతున్నారని తెలిపారు.