సంబంధిత వార్తలు

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. కొరటాల శివ-ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వస్తున్న ఈ జనతా గ్యారేజ్ పై అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ అంతా కూడా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ పై మంచి కామెంట్స్ అందజేసాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ ఈ గ్యారేజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలిసింది. ‘అత్తిలి సత్తిబాబు’, ‘దేవరాయ’ సినిమాల ఫేం విదిషా.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ‘లవ్లీ’ ఫేం హీరోయిన్ శాన్వి సోదరే ఈ విదిషా. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అనంతరం షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.