ఖాకి ఫస్ట్ లుక్.. కార్తి కొత్తగా..!

యూత్ ఫుల్ హీరో మన పక్కింటి అబ్బాయే అన్నట్టుగా నటించే కార్తి, అన్న సూర్య ఏర్పరచుకున్నట్టే తమిళంతో పాటుగా తెలుగులో సూపర్ ఇమేజ్ సంపాదించాడు. అందుకే తమిళంలో తను చేసే ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తుంటారు. ఊపిరి, కాష్మోరా సినిమాలతో అలరించిన కార్తి ఈసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ పవర్ ఫుల్ పోలీస్ గా రాబోతున్నాడు. ఖాకి సినిమాతో వస్తున్న కార్తితో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేస్తుండటం విశేషం.

తమిళంలో 'తీరన్ అదిగరమ్ ఒండ్రు' టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగులో 'ఖాకి'గా రాబోతుంది. ఇప్పటికే తెలుగు విక్రమార్కుడు సినిమా తమిళ్ లో రీమేక్ చేసి పర్వాలేదు అనిపించుకున్న కార్తి మరోసారి పోలీస్ గా అదరగొట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మరో స్పెషల్ థింగ్ ఏంటంటే రెండు దశాబ్ధాలుగా సంగీత ప్రపంచంలో తన మార్క్ వేసుకున్న ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తుండటం విశేషం. 

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు చివరన కాని, సెప్టెంబర్ మొదట్లో కాని రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయట. ప్రస్తుతం డబ్బింగ్ సినిమాతో ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య మ్యూజిక్ సొంత సినిమా చేసే ప్రయత్నాల్లో కూడా ఉందని తెలుస్తుంది.