మొదటి సినిమా రిలీజ్ అవుతుంటే..మృత్యువు!

తెలుగు సినీ నటుడు అస్లాం (కరణ్ సింగ్) బుదవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వరంగల్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసిస్తున్న అస్లాం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి సినీ పరిశ్రమలో ప్రవేశించి జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. అదృష్టవశాత్తు గత ఏడాది ప్రేమమయం అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం లభించింది. కొన్ని రోజుల క్రితమే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. అది వచ్చే నెల విడుదల కాబోతోంది. ఇంతలోనే అస్లాంను మృత్యువు కబళించింది. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి శివనగర్ లోని తన ఇంటికి వచ్చాడు. మళ్ళీ బుధవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై స్నేహితుడితో కలిసి హైదరాబాద్ తిరిగివెళుతుండగా     హన్మకొండ-హైదరాబాద్ జాతీయరహదారిపై బిబీనగర్‌ సమీపంలో వారి బైక్ ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అస్లాం తలకు తీవ్రగాయం అవడంతో అక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి కానీ ప్రాణాపాయం లేదని సమాచారం. ఈ సంగతి తెలుసుకొని కొందరు సినీ ప్రముఖులు, స్థానిక నేతలు, బంధుమిత్రులు అస్లాం ఇంటికి వచ్చి అతని తల్లితండ్రులను పరామర్శించారు. అస్లాంను అదృష్టం వరించి సినీ పరిశ్రమలో అవకాశం కల్పిస్తే, మృత్యువు అర్ధాంతరంగా పట్టుకు వెళ్ళిపోయింది.