
స్టార్ హీరోలను దర్శకులు పొగిడే తీరు చూస్తే ఆశ్చర్యపడక తప్పదు. ఈ అవకాశం ఇచ్చినందుకు అని మొదలు పెట్టడం ఆలస్యం సాధ్యమైనంతవరకు ఆ హీరోని ఆకాశానికెత్తేయడం పనిగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో నిన్న జరిగిన దువ్వాడ జగన్నాధం ఆడియో కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను భారతంలో అర్జునుడితో పోల్చాడు దర్శకుడు హరిష్ శంకర్.
ఆర్య సినిమా చూసే ఆ నిర్మాతతో.. ఈ హీరోతో పనిచేయాలనుకున్న అని చెప్పిన హరిష్ శంకర్ ఇన్నాళ్లకు ఆ అవకాశం కుదిరిందని.. ఇక కోటిశ్వరుడు కొడుకైనా సరే బన్ని కష్టపడటం చూస్తే షాక్ అవుతామని.. సినిమా మొదలైనప్పటి నుండి పూర్తయ్యే దాకా అల్లు అర్జున్ ఎంతో స్పూర్తిగా నిలిచారని అన్నాడు డిజె డైరక్టర్ హరిష్ శంకర్. సినిమాలో పాటలు కూడా లిరిక్ రైటర్స్ గొప్పగా రాశారని.. పాటలు నచ్చితే అది వారి గొప్పతనం అని.. ఒకవేళ బాగా లేకుంటే అది నా తప్పని ప్రేక్షక హృదయాలను గెలిచాడు.
ఇక డిజెలో బన్ని బ్రాహ్మణ యువకుడిగా నటించాడని.. దాని కోసం అతని ఆహార్యం కూడా మార్చుకున్నాడని.. సినిమా చేస్తున్నంత సేపు తన ఆహార అలవాట్లలో కూడా ఎంతో నిష్టగా ఉన్నాడని అన్నారు. కచ్చితంగా ఈ సినిమా బన్ని ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ లో ఉత్తేజాన్ని నింపారు హరిష్ శంకర్. సినిమాకు దేవి మ్యూజిక్ ప్లస్ పాయింట్ అవుతుందని. హీరోయిన్ పూజా హెగ్దె కూడా సినిమాలో చాలా అందంగా కనిపిస్తుందని ఈ సినిమాతో తెలుగులో ఆమెకు మంచి హిట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తనకు గబ్బర్ సింగ్ హిట్ వచ్చాక పవర్ స్టార్ తనకు మంచి మాటలు చెప్పారని. ఆ విషయాలు తన జీవితంలో ఎప్పటికి మర్చిపోనని.. ఈ కట్టె కాలే వరకు పవర్ స్టార్ ఫ్యాన్ అని.. అభిమానిగా కాదు దర్శకుడిగా పవర్ స్టార్ తో హిట్ కొట్టిన తాను మళ్లీ ఆయనతో సినిమా చేయాలని చూస్తున్నానని అన్నారు.