ఆ తరువాత ఫ్లాప్స్ గురించి ఆలోచించలేదు: దాసరి

దాసరి నారాయణ రావు సినీ పరిశ్రమలోకి తాతా మనవడు సినిమాతో ప్రవేశించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే సూపర్ హిట్ చేసిన ఆయన ఆ తరువాత వరుసగా 11 సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఈ రోజుల్లో అదొక పెద్ద రికార్డే కానీ అటువంటి అసాధారణమైన విజయాలను కూడా సాధారణమైనవిగానే భావించి దర్శకులు తమ పని తాము చేసుకొని వెళ్ళిపోతుండేవారు. దాసరి కూడా అదే కోవకు చెందినవారు. 

కొన్ని రోజుల క్రితం మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "అంతవరకు విజయాలే తప్ప ఫ్లాప్ అంటే ఏమిటో తెలియని నాకు మొదటిసారిగా ‘ముద్ద మందారం’ ఆ రుచి ఏవిధంగా ఉంటుందో చూపించింది. అప్పుడే మొదటిసారిగా ఫ్లాప్ సినిమా అంటే ఏమిటో..దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధం అయ్యింది,"అని అన్నారు. 

ఆనాటి తన చేదు అనుభవాలను వివరిస్తూ, “ఆ రోజుల్లో తెలుగు సినిమాలన్నీ మద్రాస్ లోనే తీస్తుండేవారిమి. అప్పటికే నేను వరుసగా డజను సూపర్ హిట్స్ ఇవ్వడం వలన నేను ఎక్కడికి బయలుదేరినా లేదా ఎక్కడి నుంచి వస్తున్నా నన్ను దిగబెట్టడానికి రిసీవ్ చేసుకోవడానికి నా వెనుక కనీసం ఒక డజను కార్లు కాన్వాయ్ లాగ అనుసరించేవి. ముద్దమందారం విడుదలైనప్పుడు నేను ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినట్లు వార్తలు రాగానే మద్రాస్ విమానాశ్రయంలో నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక్క కారు కూడా రాలేదు. విచిత్రమేమిటంటే ఆ రోజు నా స్వంతకారు కూడా రాలేదు. దారిలో బ్రేక్ డౌన్ అయ్యిందిట. దానితో నేను అటోలో ఇంటికి వెళ్లాను. అది చూసి నా భార్య కూడా చాలా ఆశ్చర్యపోయింది. 

ఆ సమయంలో నా చేతిలో 26 సినిమాలు ఉన్నాయి. కానీ ఆ మరుసటి రోజు నుంచి నాకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు ఒకరొకరే నా ఇంటికి వచ్చి ఏవో కుంటిసాకులు చెప్పి అడ్వాన్సులు పట్టుకుపోవడం మొదలుపెట్టారు. అలాగ వరుసగా మొత్తం 18 మంది పట్టుకుపోయారు. వరుసగా 12 హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ వస్తే మనుషులు ఎంత వేగంగా మనకు దూరం అవుతారో, పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో అప్పుడే మొదటిసారి తెలుసుకొన్నాను.

ఆ తరువాత ఫ్లాప్ ల గురించి పెద్దగా ఆలోచించలేదు...అలాగే వాటిని చూసి భయపడనూ లేదు. ఆ ఫ్లాప్ తరువాత కూడా నా మీద నమ్మకంతో సినిమాలు తీసిన నిర్మాతలున్నారు. మళ్ళీ అనేక వరుస హిట్స్ ఇచ్చాను కూడా. ఆవిధంగా ఆ సమస్య నుంచి బయపడగలిగాను,” అని దాసరి తన చేదు అనుభవాలను మీడియా ప్రతినిధితో పంచుకొన్నారు.