
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఇక భౌతికంగా మనకు కనబడనప్పటికీ ఆయన సృష్టించిన అనేక పాత్రలు, కధలు, సినిమాలు ఎప్పటికీ మన కళ్ళముందు కదులుతూనే ఉంటాయి. కొన్ని రోజుల క్రితం ఆయన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ “కధలు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడవు. అవి మనచుట్టూ ఉన్న మనుషుల జీవితాలలోనే ఉంటాయి. నిజం చెప్పాలంటే ప్రతీ మనిషి జీవితం ఒక కధను అందించగలదే. ఒక లైట్ బాయ్, ఒక హీరో, ఒక హీరోయిన్, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న మీరు అందరి జీవితాలలో ఎన్నో అనుభవాలుంటాయి. వాటిని గమనించడం అలవాటు చేసుకొంటే కధలకు ఎప్పుడూ కరువు ఉండదు. నా సినిమాలకు కధలన్నీ నా చుట్టూ ఉన్నవారి జీవితాలలో నుంచి తీసుకొన్నవే. అందుకే నా సినిమాలు, వాటిలో పాత్రలు కూడా మనకు చాలా సుపరిచితమైనవిగా కనిపిస్తుంటాయి,” అని దాసరి చెప్పారు.
ఈరోజు దాసరి అంత్యక్రియలలో పాల్గొంటున్న చాలా మంది దర్శకులు, సినీ రచయితలు, నిర్మాతలు, నటీనటులు "ఆయన లేని లోటు తీర్చలేనిది..ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి,” అంటూ పడికట్టు పదాలతో సంతాపం ప్రకటిస్తుండటం చూడవచ్చు. కానీ వారిలో ఎంతమంది ఆయనలాగా వర్తమాన సమాజాన్ని ప్రతిభింబిస్తూ, వాస్తవాలకు దగ్గరగా జీవితాలను స్పృశిస్తూ మంచి కధలతో సినిమాలు తీస్తున్నారు? అంటే ఒక్కరు కూడా కనబడరు.
పెద్ద హీరో సినిమా అంటే దానిలో విదేశాలలో చిత్రీకరించిన నాలుగు పాటలుండాలి..ఒక ఐటెం సాంగ్ ఉండాలి..హీరో ఒంటి మీద కేజీ కండలేకపోయినా వందమంది గూండాలను పిడికిలితో గుద్ది చంపేయాలి...మద్యలో నాలుగు కామెడీ సీన్లు..నాలుగు పంచ్ డైలాగులు..అంతే! ఈ మాత్రం సినిమా తీయడం కోసమే దర్శకులు నిర్మాతల చేత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించేస్తారు. అయినా కూడా ఏదీ గట్టిగా నెలరోజులు ఆడుతుందనే గ్యారంటీ లేదు.అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కా బెట్టుకోవాలన్నట్లు ఒకేసారి వీలైనన్ని ఎక్కువ దియేటర్లలో విడుదల చేసుకొని పెట్టుబడి రాబట్టేసుకొని జాగ్రత్తపడుతుంటారు.
దాసరి తన చుట్టూ ఉండేవారి జీవితాలలో నుంచి కధలు తీసుకొని కొన్ని వేల రూపాయలతో సినిమాలు తీసి వంద రోజులు ఆడించి ఆచంద్రార్కం నిలిచిపోయే పేరు ప్రతిష్టలు సంపాదించుకొంటే, నేటి తరం దర్శకులు, రచయితలు ధియేటర్లలో నుంచి సినిమా తీసేస్తే మళ్ళీ ఎన్నడూ గుర్తుకు రాని సినిమాలు తీస్తుంటారు. ఇదీ దాసరి సినిమాలకు నేటి సినిమాలకు ఉన్న తేడా.
దాసరి సినిమాలలో కధే హీరో. అందుకే అవి అంత హిట్ అయ్యాయి. కధను నమ్ముకొన్న దర్శకుడు ఎప్పుడూ చెడిపోడని చెప్పడానికి దాసరి నారాయణ రావే ఒక గొప్ప ఉదాహరణ. ఈ విషయం కనీసం ఇప్పటికైనా మన దర్శకులు, రచయితలు గ్రహిస్తారా? అంటే అనుమానమే. ఎందుకంటే వారొక ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. అందులో మునిగిపోతామని తెలిసినా బయటపడేందుకు సాహసం చేయలేరు. అందుకే వారిని చూసి దాసరి ఎప్పుడూ జాలి పడుతుండేవారు. అయితే ఆ జాలి కొంచెం పరుషంగా ఉండేది కనుక ఎవరూ ఆయన మనసును అర్ధం చేసుకోలేక అపార్ధం చేసుకొనేవారు. ఏమైనప్పటికీ, తెలుగు సినీ ప్రపంచంలో తనదైన ముద్రవేసి వెళ్ళిపోయారు దాసరి. ఎవరు అవునన్నా కాదన్నా ఆయనకు తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటారు.