మొదటి బ్లాక్ బస్టర్ ఇదే..!

అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా మే 26న రిలీజ్ కు రెడీ అవుతుంది. నిన్న సాయంత్రం సినిమా ఆడియో కార్యక్రమాన్ని జరిపారు చిత్రయూనిట్. అక్కినేని ఫ్యాన్స్ ను కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాటల వేడుక అరేంజ్ చేశామన్న నాగార్జున అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అన్న డైలాగ్ నేనొప్పుకోనని అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేశారు.    

సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ క్యారక్టరైజేషన్స్ బాగా రాస్తాడు. సోగ్గాడే చిన్ని నాయనాలో తనకు బంగార్రాజు పాత్రలానే ఈ సినిమాలో భ్రమరాంబ పాత్ర చాలా కొత్తగా ఉంటుదని అన్నారు. ఇక నాగ చైతన్య శివ రోల్ లో కనిపిస్తాడని ఆ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అన్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఓ ప్లస్ అన్న నాగ్ దేవి బిజీగా ఉండటం వల్ల రాలేదని.. తన మ్యూజిక్ టాలెంట్ వల్లే దేవి ఎప్పుడు నెంబర్ వన్ గా ఉన్నాడని అన్నారు.

ఇక సంవత్సరం నుండి తన వారసుల మీద కాన్సెంట్రేట్ చేసిన నాగ్ రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పానని గుర్తు చేసి అందులో మొదటిది ఈ సినిమా అని అన్నారు. ఇక రెండో సినిమా అఖిల్ మూవీ అని ప్రస్తుతం అది సెట్స్ మీద ఉందని అన్నారు. మొత్తానికి నాగార్జున చెప్పే మాటలను చూస్తుంటే రారండోయ్ చైతుకి సూపర్ హిట్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తుంది. మరి ఫలితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మే 26దాకా వెయిట్ చేయాల్సిందే.