
అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా (70) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్ర పొందుతున్నారు.
ఆయన 1946లో పాకిస్తాన్ లోని పెషావర్ లో జన్మించారు. దేశవిభజన సమయంలో ఆయన తల్లితండ్రులు పాకిస్తాన్ నుంచి ముంబైకి తరలి వచ్చేశారు.
వినోద్ ఖన్నా 1968లో ‘మన్ కా మీట్’ అనే చిత్రంతో హిందీ సినీరంగంలో ప్రవేశించి 141సినిమాలు చేశారు. ఆయన చేసిన వాటిలో చాలా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచి నిర్మాతలకు లాభాలు, ఆయనకు గొప్ప నటుడుగా గుర్తింపుని ఇచ్చాయి.
మేరే గావ్ మేరా దేశ్, గద్దర్, పురబ్ అవుర్ పశ్చిమ్, ఆన్ మిలో సజనా, మస్తానా, అమర్ అక్బర్ ఆంటోనీ, రాజ్ పుత్, ఖుర్బానీ, దయావాన్, హమ్ తుమ్ అవుర్ వహ్, షరాబీ, హత్యారా వంటి అనేక గొప్ప చిత్రాలు చేశారు. ఆయన చివరిగా నటించిన చిత్రం దిల్ వాలే.
వినోద్ ఖన్నా రాజకీయాలలో ప్రవేశించి వాటిలో కూడా రాణించారు. అయన 2002లో అప్పటి ప్రధాని వాజ్ పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికలలో పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి లోక్ సభ కు పోటీ చేసి ఎన్నికయ్యారు.
వినోద్ ఖన్నా గీతాంజలి దంపతులకు రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా అనే ఇద్దరు కుమారులున్నారు. కొంత కాలం తరువాత వినోద్ ఖాన్నా తన భార్యతో విడిపోయి కవిత అనే ఆమెను పెళ్ళి చేసుకొన్నారు. వారిరువురికీ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.