కేన్స్‌ చిత్రోత్సవాల్లో ‘బాహుబలి’

బాహుబలి: ది బిగినింగ్‌’ జైత్రయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీసు దగ్గర కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించిన ‘బాహుబలి’, అంతర్జాతీయ వేదికల్లోనూ తన హవా చూపిస్తోంది. ఇప్పుడు కేన్స్‌ చిత్రోత్సవాల్లోనూ స్థానం సంపాదించుకొంది. ఈ నెలలో జరగనున్న అంతర్జాతీయ సినిమా పండుగలో ‘బాహుబలి’ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 16న రాత్రి 8.30 గంటలకు ‘బాహుబలి’ని కేన్స్‌ వేడుకలో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనకు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ హాజరుకానున్నారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు ‘బాహుబలి’ చిత్రబృందం ఓ చర్చావేదికలోనూ పాల్గొననుంది. ఈ కార్యక్రమాన్ని ‘బాహుబలి’ అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.

దేశంలో తొలిసారిగా: ‘బాహుబలి’ సినిమాకి సంబంధించి దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి వర్చువల్‌ రియాలిటీ సాంకేతిక పరిజ్ఞానంతో ఓ డాక్యుమెంటరీ రూపొందించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’ మేకింగ్‌ విశేషాల్ని ఈ వీడియోలో పొందుపరుస్తారు. వర్చువల్‌ రియాలిటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... తెరపై సన్నివేశం చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి అదంతా తన కళ్లముందే జరుగుతోందన్న అనుభూతి కలుగుతుంది. ఒక విధంగా త్రీడీ వెర్షన్‌కి ఇది మరో ముందడుగన్నమాట. ఓ సినిమాపై వర్చువల్‌ రియాలిటీతో డాక్యుమెంటరీ రూపొందించడం భారతదేశంలోనే ఇదే తొలిసారి. మరి ఆ డాక్యుమెంటరీ నిడివి ఎంతో, ఎప్పుడు బయటకు వస్తుందో తెలియాల్సి ఉంది.