
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత అడ్రస్ గల్లంతయిన రాజకీయ ప్రముఖుల్లో ఒకరు విజయశాంతి.
ఆ ఎన్నికల ముందు వరకూ కూడా మంచి జోష్ మీద ఉండి.. ఎన్నికల్లో ఓటమి అనంతరం మీడియాకు మొహం చాటేసిన విజయశాంతి రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెరపై కనిపించడానికి రంగం సిద్ధం చేసుకొంటోంది. ఒక యాక్షన్ ఓరియెంటెడ్ బైలింగ్వల్ ప్రాజెక్టులో నటించడానికి కథ, కథనాలను సిద్ధం చేయించుకుందట విజయశాంతి. ఒక తమిళ దర్శకుడు ఈ ఒకప్పటి టాప్ హీరోయిన్ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు సమాచారం.
ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి తన లేటెస్ట్ ఇన్నింగ్స్ లో కూడా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ తోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం శరీరాన్ని తీర్చిదిద్దుకొనే పనిలో ఉందట ఈ మాజీ ఎంపీ. మిలటరీ తరహా ట్రైనింగ్ తీసుకొంటోందట ఈమె. ఈ సినిమాకు విజయశాంతి భర్తనే నిర్మాతగా వ్యవహరించబోతుండటం విశేషం. ఈ విజయదశమికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. వచ్చే యేడు సంక్రాంతికి విడుదలయ్యేలా షెడ్యూల్ ను ప్లాన్ ను చేసినట్టుగా ప్రకటించారు.
ప్రస్తుతానికి తన దృష్టి నటిగా కెరీర్ ను పునరారంభించడం మీదేనని.. ఇప్పుడప్పుడే రాజకీయాల మీద దృష్టి పెట్టనని విజయశాంతి తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇప్పుడప్పుడే విమర్శించడం సరికాదని.. కొంత వేచి చూడాలని అంటూ రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది లేడీ సూపర్ స్టార్. తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారా అన్న ప్రశ్నకు విజయశాంతి సూటిగా సమాధానమివ్వలేదు. తన దృష్టి అంతా సినిమాల మీదే అని స్పష్టం చేసింది.
మొత్తానికి లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టే. తన మార్కు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాతో ఆమె ఇప్పుడు ఏ మేరకు రాణించగలదో... రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తిన్న ఆమెకు సినిమా రంగంలో ఈ సారి ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి!