
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 ఎంతటి సంచలన విజయం దక్కించుకుందో తెలిసిందే. పదేళ్ల తర్వాత మెగా చరిష్మా చూపించిన ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. అయితే మార్చ్ 1న ఖైది నంబర్ 150 సినిమా 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది. అందుకే ఈసారి మెగా ఫ్యాన్స్ ఈ ఉత్సాహాన్ని అంగరంగ వైభవంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారట.
ఏరియాల వారిగా మెగా ఫ్యాన్స్ అందరు కలిసి ఈ 50 రోజుల వేడుక చేసుకుంటారట. ఈ ఈవెంట్ అంతా మెగా హీరోల ఆధ్వర్యంలోనే జరుగుతుందని టాక్. అంతేకాదు కొన్ని ఏరియాలకు మెగా హీరోలు కూడా వచ్చి ఫ్యాన్స్ తో ఈ సంభరాన్ని జరుపుకుంటారట. పదేళ్ల తర్వాత మెగాస్టార్ నటించిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల షేర్ సాధించడం ఫ్యాన్స్ అందరికి మంచి కిక్ ఇచ్చింది. మెగాస్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఖైది నంబర్ 150 అంచనాలను మించి హిట్ అయ్యింది.
ఇక మెగాస్టార్ తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నర సింహారెడ్డి బయోపిక్ తీస్తాడని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. ఈ సినిమాను కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తారని తెలుస్తుంది.