
మహాత్మ, ఒంటరి సినిమాలలో నటించిన నటి భావనపై శుక్రవారం రాత్రి ఆమె కారు డ్రైవరే, మరొక డ్రైవర్ తో కలిసి అత్యాచారం ప్రయత్నం చేశాడు. ఆమె కేరళలోని త్రిసూర్ లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ ముగించుకొని శుక్రవారం రాత్రి సుమారు 9.30 గంటలకు తన కారులోనే కోచికి బయలుదేరారు. కారు ఒక నిర్జన ప్రదేశం చేరుకొనగానే దానిని నడుపుతున్న డ్రైవర్ మార్టిన్ కారును దానిని వెంబడిస్తున్న ఆమె మాజీ కారు డ్రైవర్ సునీల్ కుమార్ ను ఎక్కించుకొన్నాడు. ఆ తరువాత వారిద్దరూ కలిసి సుమారు గంటకుపైగా నడుస్తున్న ఆ కారులో ఆమెను లైంగికంగా వేధించారు. తమ వద్ద ఉన్న ఫోన్ తో కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. ఆ తరువాత వారిద్దరూ ఒక జంక్షన్ వద్ద దిగి వెళ్ళిపోయారు. వెంటనే తేరుకొన్న భావన సమీపంలోనే నివసిస్తున్న తనకు తెలిసిన ఒక నిర్మాత ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పి ఆయన సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ మార్టిన్ న్ను అరెస్ట్ చేశారు. సునీల్ కుమార్ మాత్రం పోలీసులకు చిక్కకుండా ముందే పారిపోయాడు.
పోలీసులు విచారణలో మార్టిన్ చెప్పిన విషయాలు చాలా దిగ్భ్రాంతి కలిగించాయి. ఇదివరకు ఆమె దగ్గర పనిచేసిన సునీల్ కుమార్, తనను ఉద్యోగంలో నుంచి తొలగించినందుకు ఆమెపై కక్ష పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు. అందుకు తన సహాకారం కోరాగా తాను అంగీకరించి అతనికి సహకరించానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సునీల్ కుమార్ కోసం గాలిస్తున్నారు. తరచూ మహిళలపై జరుగుతున్న ఇటువంటి అత్యాచార ప్రయత్నాలు, మన దేశంలో మహిళలకు ఎన్నడూ ఎక్కడా భద్రతలేదని నిరూపిస్తున్నట్లున్నాయి.