
హీరోయిన్ ఓరియంటడ్ చిత్రాలలో తప్ప మిగిలిన సినిమాలలో హీరోయిన్లు గ్లామర్ షోలకే ఎక్కువ పరిమితం చేయబడుతుంటారని తెలిసిందే. రాజమౌళి తన సినిమాకి బాహుబలి అని పేరు ఎంచుకొన్నప్పుడే అది హీరోని హైలైట్ చేయబోతున్న సినిమా అని అర్ధం అయ్యింది. ఊహించినట్లుగానే మొదటి భాగంలో ప్రభాస్ ను చాలా గొప్పగానే చూపించారు. కానీ తమన్నాను కూడా ఒక గొప్ప యోధురాలుగా చూపించినప్పుడు రాజమౌళి తప్పకుండా మహిళాశక్తిని చాల గొప్పగా చూపిస్తారని అందరూ భావించారు. ఊహించినట్లుగానే తమన్నాను కొంతసేపు గొప్ప పోరాటయోధురాలుగా చూపించాడు. కానీ ప్రభాస్ ఎంట్రీతో ఆమె పాత్ర తీరు ఒక్కసారిగా మారిపోయింది. అక్కడి నుంచి ఆమెను కూడా గ్లామర్ షోకి పరిమితం చేసేశారు. ఇంకా చెప్పాలంటే ధియేటర్లో కూర్చొని ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మాదిరిగానే ఆమెను కూడ ప్రేక్షక పాత్రకే పరిమితం చేశారు. కానీ రాజమౌళి భారీతనం ముందు అది కనబడకుండా పోయింది. అది వేరే సంగతి.
ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు అంటే, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన బాహుబలి-2 స్టిల్ కారణమని చెప్పవలసి వస్తోంది. అందులో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)తో కలిసి దేవయాని (అనుష్క) విల్లు సందించి ఠీవిగా నిలబడినట్లు చూపించారు. ఇద్దరూ విల్లులు పట్టుకొని గురి చూసి బాణం వదలబోతున్నట్లుంది. ఆ పోస్టర్ లో అనుష్కని చూసి చాలా అద్భుతంగా చూపించారు. బాహుబలి మొదటి భాగంలో అనుష్క మాసిన చీరతో చాలా అందవిహీనంగా కనబడింది. కానీ రెండవ భాగంలో చేతిలో విల్లు పట్టుకొని ఒక వీరనారిలా చాలా అద్భుతంగా కనబడుతోంది. ఆ కారణంగానే ఈసారి అనుష్కకి కూడా తమన్నాకు పట్టిన గతే పట్టబోతోందా అనే అనుమానామ్ కలుగుతోంది. కనీసం ఈ భాగంలోనైనా తమన్నాకు కూడా రాజమౌళి న్యాయం చేసి ఆమె కత్తికి కాస్త పనికల్పిస్తారో లేకపోతే ఇద్దరు హీరోయిన్లని డ్యూయెట్స్ కే పరిమితం చేస్తారో చూడాలి.