దంగల్ తెలుగులో తీయలేరా..?

ఓ పక్క ప్రపంచ సినిమాకు పోటీగా తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నా సరే ప్రయోగాలకు ఇంకా వెసులుబాటు లేదు అన్నది అందరికి తెలిసిన నిజం. రీసెంట్ గా ఈ విషయంపై గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగులో దంగల్ లాంటి సినిమా చేయలేరా.. చేసే హీరోలు లేరా అని మండిపడ్డారు. దంగల్ ఆమీర్ ఖాన్ ఒక్కడే చేయగలడా మన దగ్గర అలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. తెలుగు సినిమాను జాతులు, కులాలు నాశనం చేస్తున్నాయని.. ప్రతి ప్రేక్షకుడు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

విజయవాడ రోటరీ క్లబ్ వారు అందించిన జీవిత సాఫల్య పురస్కారం అందుకునేందుకు వచ్చిన ఆయన తెలుగు సినిమాల మీద మండిపడ్డారు. మనం ప్రయోగాలు చేయకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అవార్డులను ఎగురేసుకుపోతుంటే చూస్తుండిపోతున్నామని అన్నారు. ఇక తను నటించిన మిథునం సినిమాకు ఓవర్సీస్ నుండి అభినందనలు వచ్చాయి కాని తెలుగులో మాత్రం కేవలం 10 థియేటర్లే ఇచ్చారని వాపోయారు బాలు. సిని ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసిన నపుంసకుల్లా మారిందని బావోద్వేగానికి లోనయ్యారు బాలు. 

బాలు మాట్లాడిన మాటలకు ఎంతోమంది సపోర్ట్ పలుకుతున్నారు. కమర్షియల్ యావలో పడి మన వాళ్లు ఆర్ట్ సినిమాలు అవార్డ్ సినిమాలను అందించడంలో వెనుకపడ్డారు. మరి బాలు గారి మాటలకు ఏ దర్శకుడైనా సరే ఆ ప్రయోగం చేస్తాడేమో చూడాలి.