
గుంటూరు సమీపంలో గల హాయ్ ల్యాండ్ లో శనివారం సాయంత్రం జరిగిన ఖైదీ నెంబర్:150 సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మొట్ట మొదటిసారిగా చిరంజీవి తన అభిమానుల ముందుకు వచ్చారు. ఆయనను చూడగానే అభిమానులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షద్వానాలు తెలిపారు. చిరంజీవి తన ప్రసంగం మొదలుపెడుతూ “సరిపోలేదు...మీ చప్పట్లు, ఈలలు, కేరింతలు సరిపోలేదు..ఇవి వినడానికి పదేళ్ళపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇవే నాకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి. మళ్ళీ 25 ఏళ్ళ నాటి ఆ స్పూర్తిని, ఉత్సాహాన్ని,శక్తిని నాలో నింపుతాయి. మీ అభిమానం వలన ఈ పదేళ్ళు నాకు పది నిముషాలులాగ గడిచి పోయాయి. మీ పదేళ్ళలో ఈ అభిమానమూ, ప్రోత్సాహమే ఒక శక్తిగా నన్ను నడిపించింది. అదే నన్ను మళ్ళీ ఈ సినిమా చేసేందుకు శక్తినిచ్చింది. పదేళ్ళ తరువాత మళ్ళీ మీ ముందుకు వచ్చినా నేటికీ మీరందరూ మాపై అదే అభిమానం, అదే ప్రోత్సాహం ఇస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది అభిమానులని చూస్తుంటే రోజంతా మీతోనే మాట్లాడుతూ మీతో అభిమానం పంచుకొంటూ ఉండిపోవాలనిపిస్తోంది” అని అన్నారు.
“ఈ సినిమాలో నేను జైలులో వేసుకొన్న ఖైదీ డ్రెస్ లో ఉన్నప్పుడు ఒక స్టిల్ తీశారు. నా చొక్కామీద 150 అనే నెంబర్ ను చూసిన దాసరి నారాయణ రావుగారు వెంటనే నాకు ఫోన్ చేసి ఈసినిమాకు ఖైదీ నెంబర్:150 పెడితే బాగుందని చెప్పారు. వెంటనే నేను వివి వినాయక్ తో మాట్లాడి అదే పేరును ఖరారు చేసేశాము. ఈ సినిమాకి మంచి పేరు సజెస్ట్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు,” అని చిరంజీవి అన్నారు.
సినిమా గురించి వివరిస్తూ “మళ్ళీ సినిమా చేయాలనుకొన్నప్పుడు నా అభిమానులకి మంచి పసందైన విందు భోజనం వంటిది అందించాలనే ప్రయత్నంలో చాలా కధలు విన్నాను. కానీ వాటిలో ఒకటి ఉంటే మరొకటి ఉండేది కాదు. చివరికి తమిళంలో ఈ కత్తి సినిమాను చూడగానే నాకు అర్ధం అయిపోయింది. ఇదే నాకు, నా అభిమానులకి సరైన సినిమా అని నాకు అర్ధం అయ్యింది. ఈ సినిమాపై నేను ఆసక్తి చూపుతున్నట్లు తెలియగానే తమిళ్ హీరో విజయ్ చాలా చొరవ తీసుకొని నాకు దాని హక్కులు దక్కేలా చేశాడు. అందుకు అతనికి ఈవిషయంలో నాకు సహాయపడిన వారందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను,” అని చిరంజీవి అన్నారు.
“ఈ సినిమా చూడగానే మొట్ట మొదట నాకు గుర్తుకు వచ్చిన వ్యక్తి వివి వినాయకే. వెంటనే అతనిని పిలిచి కత్తి గురించి చెప్పగానే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే ఒప్పుకొన్నాడు. అప్పుడే ఈ సినిమా సగం విజయం సాధించేసిందని అర్ధం అయ్యింది. ఈ సినిమాలో నా అభిమానులు నన్ను ఎలాగా చూడాలనుకొంటారో వివి వినాయక్ నన్ను సరిగా అలాగే చూపించాడు. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత అయినప్పటికీ, అతను ధృవ సినిమా షూటింగ్ కోసం వేరే దేశంలో ఉండటంతో వివి వినాయక్ నిర్మాత బాధ్యత కూడా తీసుకొన్నట్లుగా అన్నీ చాలా పొదుపుగా, పద్దతిగా, బడ్జెట్ దాటి పోకుండా చాలా జాగ్రత్తగా పూర్తి చేశాడు. అతనిని చూస్తుంటే చాలా ముచ్చటేసేది. నాకిప్పుడు ముగ్గురు తమ్ముళ్ళు అయ్యారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, వివి వినాయక్,” అని చిరంజీవి అన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన స్టయిల్లో ఒక డైలాగ్ చెప్పారు. “రాననుకొన్నారా రాలేననుకొన్నారా...డిల్లీకి పోయాడు..అభిమానులకి దూరం అయ్యాడనుకొన్నారా...వచ్చాడు..బాస్ ఈజ్ బ్యాక్...అదేమాస్ అదే గ్రేస్” అని చెప్పగానే అభిమానులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు.
ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ “రామ్ చరణ్ ఇంతవరకు ఒక నటుడుగా తన సత్తా చాటి చూపించాడు. ఈ సినిమాతో ఒక నిర్మాతగా కూడా తన సత్తా చాటి చూపుకొన్నాడు. ఎక్కడో వేరే దేశంలో ఉన్నా కూడా అతని మనసంతా ఎప్పుడూ ఈ సినిమాపైనే ఉండేది. మేము క్రొయేషియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి ఈ సినిమాలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, మిగిలిన సభ్యులు అందరికీ ఖర్చులు ఉంటాయని కనుక వారికి అవసరమైనంత డబ్బు ఇవ్వమని పదేపదే చేపుతుండేవాడు. ఒక మంచి నిర్మాతకు ఉండవలసిన లక్షణం తనకు ఉందని రామ్ చరణ్ నిరూపించుకొన్నాడు,” అని మెచ్చుకొన్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తన అందచందాలతో ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అన్నారు. ఆమె గురించి కూడా చిరంజీవి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. “సాధారణంగా మన సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ముందు తండ్రితో నటించిన తరువాత కొడుకుతో నటిస్తుంటారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ముందుగానా కొడుకుతో నటించిన తరువాత నాతో నటిస్తోంది. ఇదీ ఒక సరికొత్త రికార్డే,”అని అన్నారు.
ఈ సినిమా చేయడానికి తనకు సహకరించిన వారందరికీ చిరంజీవి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. అభిమానులతో ఇంకా చాలాసేపు మాట్లాడాలని ఉన్నా అల్లు అరవింద్ ప్రసంగం తొందరగా ముగించమని తొందర పెడుతున్నాఋ కనుక ముగించాక తప్పడం లేదని చెపుతూ చిరంజీవి అభిమానుల వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయారు.