మాపై నోరు పారేసుకొన్నవారికీ ఇదే జవాబు: అల్లు అర్జున్

గుంటూరు సమీపంలో గల హాయ్ ల్యాండ్ లో శనివారం సాయంత్రం ఖైదీ నెంబర్:150 సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొదట్లోనే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నాగబాబు తీవ్ర విమర్శలు చేసి వేడి పుట్టిస్తే, అల్లు అర్జున్ కూడా తమ కుటుంబాన్ని విమర్శిస్తున్న వారిపై చాలా ఘాటుగా జవాబు చెప్పాడు. 

తమ విమర్శకులకు సమాధానం చెపుతూ, “ఈ పదేళ్ళలో మేము ఎదుర్కొన్న చెప్పుకోలేని కష్టాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని అవమానాలకు ఈ సినిమాయే జవాబు చెప్పబోతోంది. ఇంతకాలం మాపై విమర్శలు చేసినవాళ్ళ నోళ్ళని ఈ సినిమా మూయిస్తుంది. ఇంతకాలం మమ్మల్ని వేలెత్తి చూపిన చేతులు ముడుచుకొంటాయి. ఇక నుంచి ఒక్కో సినిమా వారి నోళ్ళని మూయిస్తుంది. ఈ సినిమా వారందరికీ ఒక స్వీట్ వార్నింగ్ వాటిందని గ్రహిస్తే మంచిది. ఇక చిరంజీవి గారి సినిమాలను చూసి అయన డ్యాన్సులు, ఫైట్స్, పాటలు, డైలాగ్స్ మాత్రమే నేర్చుకొంటే సరిపోదు. ఆయన కున్న గొప్ప సంస్కారాన్ని కూడా అందరం నేర్చుకోవాలి. ఈ సంక్రాంతి పండుగకి ఇంకో పెద్ద సినిమా, కొన్ని చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవన్నీ కూడా బాగా అది సూపర్ హిట్ అవ్వాలని కోరుకొందాము,” అని అల్లు అర్జున్ అన్నారు.   

“ఈ సినిమా కోసం గత పదేళ్ళుగా ఎదురు చూస్తున్నాను. చిరంజీవిగారి సినిమాకి ఆయన వీరాభిమాని వివి వినాయక్ అయితేనే న్యాయం చేయగలరని అనుకొంటూ ఉండేవాడిని. నేను కోరుకోన్నట్లుగానే ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం నాకు చాలా ఆనందం కలిగించింది. చిరంజీవిగారి అభిమానులు అందరూ ఆయనను ఏవిధంగా చూడాలనుకొంతున్నారో వివి వినాయక్ అదే విధంగా చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. నేను కూడా మీలాగే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడుచూసేద్దామా అని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను,” అని అన్నారు.