ఖైదీ నెంబర్:150 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైలైట్స్

గుంటూరు సమీపంలో గల హాయ్ ల్యాండ్ లో శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్:150 సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఊహించినట్లుగానే వేలమంది అభిమానులు తరలిరావడంతో ఎక్కడా నిలబడేందుకు కూడా ఖాళీ లేకపోవడంతో లైటింగ్ కోసం అమర్చిన స్టాండ్స్ పై కూడా అభిమానులు ఎక్కి నిలబడి చూడవలసి వచ్చింది.  

ఈ కార్యక్రమం హైలైట్స్:

ఈ కార్యక్రమం మొదట్లోనే ఎవరూ ఊహించని విధంగా నటుడు నాగబాబు, తమ కుటుంబ సభ్యులపై విమర్శలు గుప్పించిన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. 

పరుచూరి సోదరులిద్దరూ చిరంజీవితో తమకున్న అనుబందం గురించి క్లుప్తంగా వివరించారు. వారిలో గోపాలకృష్ణ కొన్ని డైలాగ్స్ చెప్పి మెగాభిమానులను రంజింపజేశారు. 

కాజల్ అగర్వాల్ వచ్చీరాని తెలుగులో ప్రసంగించి అభిమానులను ఆకట్టుకొన్నారు. చిరంజీవిగారితో కల్సి నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదని, ఈసినిమా తన కెరీర్ లో డెస్టినేషన్ సినిమాగా నిలిచిపోతుందని అన్నారు. 

చిరంజీవి గారి సినిమాలో నటించడం ఇదే మొదటిసారని తనకు ఆ అదృష్టం కలిగించినందుకు దర్శకుడు వివి వినాయక్ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు నటుడు రఘుబాబు.

దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత అన్నయ చిరంజీవి నన్ను సరైన మార్గంలో నడిపించారు. నాకు ఆయన నిజంగా అన్నవంటి వారే. ఆయన అభిమానినైన నేను మెగాభిమానులు ఆయనను ఏవిధంగా చూడాలనుకొంటారో ఆవిధంగానే చూపించాను. వారు కోరుకొనే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి,” అని అన్నారు.  

ఈ కార్యక్రమంలో చివరిగా చిరంజీవి మాట్లాడుతుంటే, బయట జనం విపరీతంగా పెరిగి పోతుండటంతో వీలైనంత తొందరగా ప్రసంగం ముగించి వెళ్ళిపోవాలని పోలీస్ అధికారులు అల్లు అరవింద్ కి చెప్పడంతో ఆయన చిరంజీవికి చెప్పి ముగింపజేశారు. ప్రసంగం ముగిసిన వెంటనే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు అందరూ వారివారి కార్లలో వెళ్ళిపోయారు. జనం పెరిగిపోతే త్రొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందనే భయంతోనే పోలీసులు ఆవిధంగా కోరడంతో చిరంజీవి తదితరులు వారి అభ్యర్ధన మన్నించి అయిష్టంగానే హడావుడిగా వెళ్ళిపోయారు.