
ఓ పక్క కమర్షియల్ సినిమాలను తీస్తూనే ప్రయోగాలు చేయడం కింగ్ నాగార్జునకు కొత్తేమీ కాదు. క్యారక్టర్ ఎలాంటిదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి అభినయం కనబరచడంలో ఈ నాటి మేటి స్టార్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు నాగార్జున. ప్రస్తుతం నాగ్ నటిస్తున్న సినిమా ఓం నమో వెంకటేశాయ. రాఘవేంద్ర రావు డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా సాయి కృప క్రియేషన్స్ పతాకంలో మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
హతిరాం బాబా జీవిత చరిత్ర కథతో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల్లో భక్తుడిగా శిరిడి సాయిలో సాయి నాదునిగా నటించి మెప్పించిన నాగార్జున ఇప్పుడు హతిరాం బాబాగా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కూడా సర్ ప్రైజ్ చేసింది. భక్తి చిత్రాల్లో నటించాలంటే తనకు తానే సాటి అన్నట్టుగా నాగ్ నటన ఉంది. టీజర్ తోనే సినిమా చూపించేసిన దర్శకేంద్రుడు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. జనవరి లో ఆడియో వేడుక కూడా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న నాగార్జున ఓం నమో వెంకటేశాయతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.