టీజర్ గిఫ్ట్ అందించిన వెంకటేష్..!

తెలుగు తెర మీద దగ్గుబాటి వారసుడు విక్టరీ వెంకటేష్ ది ప్రత్యేకమైన ఇమేజ్ అని చెప్పాలి. ఓ బడా నిర్మాత కొడుకుగా కలియుగ పాండవులు సినిమాతో సిని రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ కెరియర్ లో మంచి మంచి హిట్లతో విజయాలను సాధిస్తూ ఆ విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్నాడు. రీసెంట్ గా బాబు బంగారంతో ఫ్యాన్స్ తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి లుక్ తో సూపర్ అనిపించేలా చేసిన వెంకటేష్ ప్రస్తుతం తమిళ హింది భాషల్లో హిట్ సినిమాగా క్రేజ్ సంపాదించిన సాలా ఖదూస్ రీమేక్ గురుగా రాబోతున్నాడు.

సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్ లో నటించిన రితిక సింగ్ ఇక్కడ నటిస్తుంది. ఇక ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా గురు టీజర్ ను రిలీజ్ చేశారు. రానా ట్విట్టర్ లో రిలీజ్ చేసిన ఈ టీజర్ వెంకటేష్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇక టీజర్ లో వెంకటేష్ లుక్ డ్యాన్స్ బిట్ కేక పెట్టించేసింది. బాక్సింగ్ కోచ్ గా కనిపించబోతున్న వెంకటేష్ సినిమా లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్న సంగతి తెలిసిందే.

రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే వెంకటేష్ మరో హిట్ కొట్టబోతున్నాడనే తెలుస్తుంది. జనవరి 26న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ గురు వెంకీ అభిమానులను ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.