
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు పవన్ సాధినేనిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఒక నటి పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతనిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ మీద చంచల్ గూడా జైలుకి తరలించారు.
పవన్ సాధినేని యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి ఇంటర్వ్యూ , లవ్ ఫార్ములా 31 , బేవార్స్ వంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపు సంపాదించుకున్నాడు. 2013లో టాలీవుడ్‌లో అడుగుపెట్టి ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో బోణీ కొట్టాడు.
ఆ తర్వాత నారా రోహిత్ (సావిత్రి), రాజేంద్రప్రసాద్‌తో (సేనాపతి) సినిమాలు చేశాడు. తర్వాత కొన్ని వెబ్ సిరీస్ కూడా చేసి తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాడు.
అది దాదాపు పూర్తవుతున్న సమయంలో ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. కనుక బెయిల్‌పై విడుదలై బయటకు రావడం ఆలస్యమైతే ఆ సినిమాపై ప్రభావం పడుతుంది.