
సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాశి’ పోస్టర్లో అంటార్కిటికాని కూడా చూపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉండే అంటార్కిటికాలో షూటింగ్ అంటే మామూలు విషయం కాదు.
కనుక రాజమౌళి ఎలా తీస్తారో చూద్దామని ప్రేక్షకులు ఆశపడ్డారు. కానీ రెండు రోజుల క్రితం రాజమౌళి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ వారణాశిలో ప్రధాన సన్నివేశాల షూటింగ్ పూర్తయిందని, ఇక కథని కలిపే చిన్న చిన్న సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పడంతో అంటార్కిటికాలో షూటింగ్ ఆలోచన విరమించుకున్నట్లు అర్ధమవుతోంది.
స్టూడియోలోనే సెట్స్ వేసి గ్రాఫిక్స్ ఉపయోగించి ఆ సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసి ఉండవచ్చు. లేదా ఆ సన్నివేశాలని మార్చి వేరే లొకేషన్లో చిత్రీకరించి ఉండవచ్చు.
ఏది ఏమైనప్పటికీ రాజమౌళి వారణాశిని ఇంత త్వరగా ముగించి ముందు ప్రకటించినట్లు 2027 ఏప్రిల్ విడుదల చేసేందుకు సిద్దమవుతుండటంతో మహేష్ బాబు అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, పృద్విరాజ్ సుకుమారన్, ప్రియాంకా చొప్రా తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు.
ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.