
తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, కథా రచయితగా తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ దిగ్గజం కె. భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ఓ గొప్ప కథకుడిని, అద్భుతమైన స్క్రీన్‌ప్లే రచయితను కోల్పోయింది.
ప్రేక్షకుడు కుర్చీలోంచి లేవకుండా సినిమా కథ చెప్పగలిగే అతి కొద్దిమంది దర్శకులలో భాగ్యరాజ్ ఒకరు. అందుకే ఆయన 'స్క్రీన్‌ప్లే మాంత్రికుడు'గా మంచి పేరు సంపాదించుకున్అంనారు.
భాగ్యరాజ్ 1979లో విడుదలైన ‘సువరిల్లాద చిత్రంగళ్’ సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 75కు పైగా సినిమాల్లో నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ప్రముఖ నటీమణులు ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే.
తెలుగు ప్రేక్షకులతో కూడా భాగ్యరాజ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. దివంగత శ్రీదేవి తొలి సూపర్ డూపర్ హిట్ సినిమా ‘పదహారేళ్ల వయసు’లో ఆయన తొలి తెలుగు చిత్రం.
ఆ తర్వాత ‘మూడు ముళ్లు’, ‘చిలిపి పెళ్లాం’, ‘చిన్న రాజా’, ‘పోలీస్ బావ’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 1992లో విడుదలైన ‘సుందరకాండ’ చిత్రానికి దర్శకత్వం వహించి ఘన విజయాన్ని అందుకున్నారు.
ఇటీవల కాలంలో చేసిన సినిమాలలో ‘అల్లంత దూరాన’, ‘35-చిన్న కథ కాదు’, ‘కుబేర’ సినిమాలలో ఆయన నటించారు.
తమిళం, తెలుగు మాత్రమే కాదు.. బాలీవుడ్‌పైనా భాగ్యరాజ్ తన ముద్ర వేశారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, అనిల్ కపూర్ నటించిన ‘వో సాత్ దిన్’ వంటి విజయవంతమైన చిత్రాలకు కథలను అందించారు.
సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. 2014లో సినీ రంగంలో విశిష్ట సేవలకు గాను సైమా పురస్కారం ఆయనను వరించింది.
భాగ్యరాజ్ మరణ వార్తతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంతాపం వ్యక్తం చేశారు.
వెండి తెరపై ఇక ఆయన కనిపించకపోవచ్చు. కానీ ఆయన రాసిన కథలు, రూపొందించిన పాత్రలు, చూపించిన స్క్రీన్‌ప్లే, చేసిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సజీవంగానే నిలిచిపోతాయి.