నందికి బదులు సింహం వస్తోంది

ఇదివరకు సమైక్య రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డులని ఇచ్చేవారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కనుక ఇకపై నంది అవార్డుల స్థానంలో సింహా అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమని ప్రోత్సహించడానికి కొత్త సినీ పాలసీని కూడా రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా చిన్న సినిమాలని ప్రోత్సహించడానికి గాను రాష్ట్రంలో అన్ని ధియేటర్లలో సాయంత్రం 4-6 గంటలకి ఒక చిన్న సినిమా ప్రదర్శన తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే సినీ నిర్మాణాలకి కావలసిన అన్ని అనుమతులని సింగిల్ విండో పద్దతిలో కేవలం వారం రోజులలోనే మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ లోనే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మాతలు లేదా వారి ప్రతినిధులు తమ సినిమా షూటింగ్ కి కావలసిన అనుమతుల కోసం దరఖాస్తు, తగిన ఫీజులు అక్కడ చెల్లించగానే వారి తరపున ఆ సెల్ అధికారులే సంబంధిత శాఖలకి అభ్యర్ధనలు పంపించి అన్ని అనుమతులు మంజూరు చేయించి నిర్మాతలకి ఆ విషయం ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తారు. అప్పుడు వారు ఆ ప్రకారం సినిమా షూటింగులు జరుపుకోవచ్చు. ఒకవేళ వారంలోగా సెల్ నుంచి ఎలాంటి సమాధానం రానట్లయితే, అన్ని అనుమతులు మంజూరు అయినట్లే భావించి షూటింగ్ చేసుకొనేందుకు వీలు కల్పిస్తూ నియమనిబంధనలు రూపొందించబోతున్నారు.

సినీ పరిశ్రమ అభివృద్ధికి...ముఖ్యంగా చిన్న సినిమాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ఈ చర్యలు ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. కానీ నేటికీ సినీ పరిశ్రమ ఆంధ్రా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల చేతిలోనే ఉంది. అది వారి తప్పు కాదు. కనుక తెలంగాణాకి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంది. అలాగే సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకొని వారికి ‘ఉద్యోగ భద్రత’, రవాణా, వైద్యం, భీమా, ఇళ్ళ నిర్మాణం వంటి సంక్షేమ పదకాలన్నీ అమలు చేయగలిగితే వేలాదిమందికి మేలు చేసినదవుతుంది.

అలాగే కొన్ని తెలంగాణా న్యూస్ ఛానల్స్ లో స్వచ్చమైన తెలంగాణా బాష, యాసతో విజయవంతంగా నడుస్తున్నందున, తెలంగాణా బాష, యాస, ప్రజల జీవన శైలిని ప్రతిభింబించే విధంగా సినిమాలు తీయడానికి ప్రోత్సహించాలి. వివిధ రంగాలలో తెలంగాణా ముద్ర కనిపింపజేయగలిగినప్పుడు సినీ పరిశ్రమపై మాత్రం ఎందుకు సాధ్యం కాదు? పాలకులు ఆలోచించాలి.