
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని బుచ్చిబాబు చెప్పారు.
ఈ పాటకి అనేక మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తర్వాత చివరికి ‘శ్రుతీ హాసన్’ని ఖరారు చేయడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె ఐటెం సాంగ్స్ చేసి మెప్పించగలరని మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాతో, ఒక్కడు హిందీ రీమేక్ ‘తేవర్’లో నిరూపించారు. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హాయ్ నాన్న సినిమాలో చేస్తే దాని పరిస్థితి అంతే.
కనుక భారీ అంచనాలున్న పెద్ది కోసం ఆమెను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ఐటెం సాంగ్ షూటింగ్ కూడా మొదలైపోయింది. దీనినీ పెద్ది రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు తీస్తున్నారనే టాక్ అభిమానులకు ఊరట కలిగిస్తోంది. కనుక పెద్దితోనైనా శ్రుతీ హాసన్ మళ్ళీ పుంజుకుంటారని ఆశించవచ్చు.
ఈ నెల 30న విడుదల కావాల్సిన పెద్ది జూన్‌కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.