ఫస్ట్ టైమ్‌ వేదికపై కన్నీళ్ళతో పాయల్ రాజ్‌పుత్

తెలుగు ప్రేక్షకులకు పాయల్ రాజ్‌పుత్ పరిచయం అవసరం లేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా అద్భుతమైన తన నటన, అందచందాలతో మెప్పించి తెలుగు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు.

ఆమె బాయ్ ఫ్రెండ్ సౌరబ్ హీరోగా చేసిన ‘ఫస్ట్ టైమ్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. అతని కోసం పాయల్ రాజ్‌పుత్ దానిలో పాల్గొన్నప్పుడు ఓ విలేఖరి ఆమె ఎదుర్కొన్న సమస్యలని ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూనే “నాకు మా నాన్నగారంటే ప్రాణం. నా ప్రతీ సినిమాకి ఆయనే విమర్శకుడు. ఇటీవల నేను నటించిన పంజాబీ సినిమా చూడాలనుకున్నారు. కానీ అయన క్యాన్సర్ బారిన పడ్డారు. ఓ పక్క ఆయన ఆరోగ్యం గురించి దిగులు. మరో పక్క మా అమ్మ గురించి దిగులు. ఇలాంటి పరిస్థితిలో నా కెరీర్ ఏమవుతుందో అనే ఆందోళన. దాంతో నేను తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడికి గురయ్యాను. 

ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే నేను ఈ మానసిక ఒత్తిళ్ళు భరించలేక జైపూర్ వెళ్ళి విపాసనలో చేరి ధ్యానం ద్వారా కోలుకున్నాను. కానీ ఇప్పుడు నా తండ్రి లేరు,” అంటూ తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. 

వేదికపై ఉన్నవారు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ మాటలతో వివరించలేని బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. వేదికపై అలా అందరి ముందు కన్నీళ్ళతో ఉండలేక కార్యక్రమం మద్యలో వెళ్ళిపోయారు. ఆమె బాధను అర్థం చేసుకున్న చిత్ర బృందం, ప్రేక్షకులు ఆమె వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక మౌనంగా చూస్తుండిపోయారు.        

(Video Source: Chota News App)