
నిన్న ఉగాది పండుగ, నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
గత 14 ఏళ్ళుగా అవార్డుల ప్రదానోత్సవం నిలిచిపోయిందని, మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా సిఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభించారని... అదీ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ అవార్డులు ఇస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ముక్త కంఠంతో అన్నారు.
అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంటే ఏపీ ప్రభుత్వం చాలా వెనకబడిపోయిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కనుక ఇప్పటికైనా మళ్ళీ నందీ అవార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమకి ఏ కష్టం వచ్చినా సిఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తున్నారని, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని సినీ ప్రముఖులు అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్లో సినీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు తమకీ చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్, ఆర్.నారాయణ మూర్తి, జయసుధ, మాధూరీ దీక్షిత్, ఖుష్బూ, రామ్ చరణ్, నాగ చైతన్య, రష్మిక మందన, నితిన్, జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్, నిర్మాతలు దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీ దత్, దర్శకులు అనిల్ రావిపూడి, సాయిలు కంపాటి, గుణ శేఖర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.