.jpg)
రామ్ గోపాల్ వర్మ సినిమాలలో రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి రక్తపాతం మరొకటి వివాదాలు. సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్లలో నుంచే రక్తం ప్రవహిస్తుంటుంది. అయితే సినిమా మొదలుపెట్టక మునుపే వివాదం కూడా మొదలై, విడుదలయ్యే వరకు సమాంతరంగా సాగుతుంది. ఆయన తాజాగా తీసిన వంగవీటి చిత్రం కూడా అందుకు మినహాయింపు కాదు. ఒకప్పుడు విజయవాడ కుల రాజకీయాలని శాసించిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా జీవిత కధ ఆధారంగా తీసినదది. కనుక రక్తపాతం, వివాదాలు సహజమే.
రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచే వంగవీటి రంగా భార్య రత్నకుమారి, వారి కుమారుడు రాదా కృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తునే ఉన్నారు. కానీ వర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా తన అలవాటు ప్రకారం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాకి అవసరమైన ఫ్రీ పబ్లిసిటీ బాగానే సంపాదించుకొన్నారు. బస్తీ మే సవాల్ అన్నట్లు వంగవీటి ఆడియోని ఈ రోజు విజయవాడలోనే విడుదల చేస్తానని, తను దానికి వస్తున్నానని సవాల్ చేసినట్లు మాట్లాడారు.
వంగవీటి రాధాకృష్ణ ఆ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఓ పాటని తొలగిస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించేసి సమస్య పరిష్కారం అయిపోయిందనుకొన్నాడు. కానీ సినిమా విడుదల చేస్తే రామ్ గోపాల్ వర్మని రాష్ట్రంలో తిరుగనీయమని వంగవీటి రాదా మిత్ర మండలి హెచ్చరించింది. ధియేటర్ యాజమాన్యాలకి కూడా హెచ్చరికలు జారీ చేసింది. దానితో రామ్ గోపాల్ వర్మ దిగి రాక తప్పలేదు.
కొద్ది సేపటి క్రితం వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారి, వారి అనుచరులతో విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నాల్గవ అంతస్తులో రామ్ గోపాల్ వర్మ దానిపై చర్చలు జరిపాడు. ఆ సమావేశానికి వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని కూడా హాజరవడం విశేషం.
వంగవీటి కుటుంబ సభ్యులు ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దానిపై రామ్ గోపాల్ వర్మ స్పందన తెలియలేదు కానీ సమావేశం అనంతరం వంగవీటి రాధాకృష్ణ మీడియాతో చెప్పిన దానిని బట్టి రామ్ గోపాల్ వర్మ ఆ సన్నివేశాలని మార్చడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.
సమావేశం అనంతరం రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ “మేము ఏమి చర్చించాము...దానిపై నా స్పందన ఏమిటి? వారి స్పందన ఏమిటి? స్క్రిప్ట్ మళ్ళీ మారుస్తానా లేదా అనే ప్రశ్నలకి నేను ఇప్పుడు జవాబు చెప్పను. ఒక దర్శకుడిగా నేను నా హక్కులని కాపాడుకొంటాను అంతే,” అని చెప్పారు.
రామ్ గోపాల్ వర్మ మీడియాకి ఏమీ చెప్పక పోయినా కొద్ది సేపటి క్రితం తన ఫేస్ బుక్ లో పెట్టిన మెసేజ్ లో “నా సినిమాపై ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రాదా మండలిలో చాలా మంది నాకు ఈ సినిమా తీయడానికి సహాయపడ్డారు. బహుశః వారు కూడా ఈరోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి రావచ్చు,” అని ఒక మెసేజ్ పెట్టారు. మరో మెసేజ్ లో “నాకు చాల వార్నింగ్ మెసేజులు వచ్చాయి. కానీ మొట్టమొదటి సారిగా చాలా మృదువుగా హెచ్చరికని విన్నాను. అది చాలా డేంజరస్ గా అనిపించింది. అయినా నేను రాజీపడే ప్రసక్తి లేదు,” అని పెట్టారు. అంటే దీనిపై వంగవీటి కుటుంబంతో అమీ తుమీ తేల్చుకోవడానికే రామ్ గోపాల్ వర్మ సిద్ద పడినట్లు కనిపిస్తోంది. విజయవాడలో ప్రముక రాజకీయ నేత దేవినేని నెహ్రూ కూడా రామ్ గోపాల్ వర్మకి మద్దతుగా మాట్లాడటం విశేషం.