బాలానగర్ విమల్ థియేటర్‌పై అభిమానులు దాడి

హైదరాబాద్‌, బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ థియేటర్లో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రాజసాబ్ ప్రీమియర్ షో వేశారు. ఈ విషయం తెలుసుకొని భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. 

తమనీ సినిమా చూసేందుకు అనుమతించాలని వారు కోరారు. కానీ థియేటర్ యాజమాన్యం నిరాకరించడంతో వారు బలవంతంగా లోపలకు దూసుకు వెళ్ళారు. థియేటర్ సిబ్బంది వారిని ప్లాస్టిక్ పైప్‌తో కొట్టి బయటకు పంపించేశారు. దీంతో ఆగ్రహం చెందిన అభిమానులు థియేటర్ అద్దాలు పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. 

పరిస్థితి అదుపుతప్పుతుండటంతో థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి స్వల్పంగా లాఠీఛార్జి చేసి అభిమానులను అక్కడి నుంచి పంపించేశారు. 

రాజాసాబ్ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని అందరికీ తెలుసు. కనుక మొట్టమొదట వారికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే, టికెట్ ఛార్జీలు ఎంతగా పెంచినప్పటికీ వారు ఏమాత్రం వెనకాడకుండా కొనుక్కొని సినిమా చూస్తుంటారు. 

వారి వల్లనే సినిమా నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్లకు ఆదాయం వస్తుంది. సినిమా బాగున్నా లేకున్నా వచ్చి చూసి ఆడించేది కూడా వారే. కనుక ముందుగా వారికే ప్రాధాన్యం ఇవ్వాలి కదా? కానీ రివ్యూలతో సినిమాలని హత్యాచారం చేసే మీడియా ప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమేనా? 

తెలంగాణ ప్రభుత్వం నిన్న అర్దరాత్రి దాటినా తర్వాత టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు జీవో జారీ చేసింది. కనుక విమల్ థియేటర్ యాజమాన్యం అభిమానులను అనుమతించకపోయి ఉండొచ్చు. కానీ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా షో వేసే బదులు ఉదయం అభిమానులతో పాటు చూసేందుకు సీట్లు కేటాయిస్తే ఈ సమస్య తలెత్తేది కాదు కదా?

వీడియో: చోటా న్యూస్ యాప్ సౌజన్యంతో