
చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్తో సహా మొత్తం 23 మందిపై మూడు రోజుల క్రితం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. గత ఏడాది డిసంబర్ 4న హైదరాబాద్లో సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో విడుదలయ్యింది.
దానికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. దానిలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. అతను నేటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు.
అల్లు అర్జున్, అల్లు అరవింద్ వారి కుటుంబానికి భారీగా నష్టపరిహారం చెల్లించారు. ఆ పిల్లాడి వైద్య చికిత్సకయ్యే ఖర్చు మొత్తం భరిస్తున్నారు.
కానీ థియేటర్ వద్ద ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమయ్యారు. కనుక పోలీసులు అల్లు అర్జున్తో సహా మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
వారిలో సంధ్య థియేటర్ నిర్వాహకులు (ఏ-1), అల్లు అర్జున్ (ఏ-11)గా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. వారితో పాటు థియేటర్ సిబ్బంది, అల్లు అర్జున్ బాడీ గార్డ్స్ ఇంకా పలువురిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు.