
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా రూపొందిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ జనవరి 12న సంక్రాంతి పండగకు రెండు రోజుల ముందు విడుదలకాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు వచ్చేశాయి. వాటిలో ‘మీసాల పిల్ల’ పాటకి మంచి ఆదరణ లభించింది. అయితే అభిమానులు మాత్రం మరో పాట కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే.. చిరంజీవి-వెంకటేష్ కలిసి చేసిన పాట, డాన్స్!
మెగా విక్టరీ మాస్ సాంగ్ అంటూ వారిద్దరి ఆటపాట నేడు వచ్చేసింది. నేడు ఈ పాట ప్రమో విడుదల చేశారు. పూర్తిపాట ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. ఈ పాట ప్రమోలో ఇద్దరు హీరోల ఎంట్రీ చూపి మిగిలింది న్యూఇయర్ గిఫ్ట్ కోసం దాచి పెట్టారు. ఇద్దరు పెద్ద హీరోలు డాన్స్ చేసిన ఈ పాటని కాసర్ల శ్రీరాం వ్రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విజయ్ పోలక్కి కోరియోగ్రఫీ చేశారు.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్ర చేస్తున్నారు. రెండో హీరోయిన్గా క్యాథరిన్ చేస్తున్నారు. హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 12న సంక్రాంతి పండగకి ముందు విడుదల కాబోతోంది.