డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్!

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ మాదక ద్రవ్యాల కేసులో చిక్కుకున్నారు.

ఇటీవల హైదరాబాద్‌, మసాబ్ ట్యాంక్ వద్ద మాదకద్రవ్యాల కేసుపై పోలీసులు, ఈగల్ టీమ్‌ ట్రూప్ బజార్‌లోని నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారుల నుంచి 43 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి అమన్ ప్రీత్, మరో నలుగురు వ్యక్తులు మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తుంటారని తేలింది. దాంతో పోలీసులు, ఈగల్ టీమ్‌ వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈవిషయం ముందే పసిగట్టిన అమన్ ప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల సరఫరా, వాడకాన్ని కట్టడి చేయడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు, కానీ తరచూ నగరంలో రేవ్ పార్టీలలో, ఇలా రహస్యంగా మాదక ద్రవ్యాల అమ్మకాలు, వాడకం కొనసాగుతూనే ఉంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో ఏళ్ళు శ్రమించి ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదిగారు. జిమ్ సెంటర్లు కూడా స్థాపిస్తూ మంచి బిజినెస్ విమెన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

కానీ ఆమె సోదరుడు ఈవిధంగా మాదకద్రవ్యాల కేసులో చిక్కుకోవడం, పరారి అవడంతో చేయని తప్పుకి ఆమె అందరి ముందు తలదించుకునేలా చేశారని చెప్పక తప్పదు.