బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల

టాలీవుడ్‌ బ్యూటీ, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కూడా బాలీవుడ్‌లో ప్రవేశిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘ఛూ మంతర్’ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మొదట అనన్య పాండేని హీరోయిన్‌గా తీసుకున్నారు.

కానీ వేరే సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ‘ఛూ మంతర్’కు కాల్షీట్స్ సర్దుబాటు చేసుకోలేకపోవడంతో ఆమె స్థానంలో శ్రీలీలని తీసుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే రష్మిక మందన తన సత్తా నిరూపించుకున్నారు. ఇప్పుడు శ్రీలీల కూడా ఈ సినిమాతో బాలీవుడ్‌ని, ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అభయ్ వర్మ హీరోగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 

శ్రీలీల కోలీవుడ్‌లో కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న  ‘పరాశక్తి’లో శివ కార్తికేయన్‌కి జంటగా శ్రీలీల నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.