
ఇటీవల అఖండ-2 సినిమాకు కోర్టు కేసుతో ఎదురైన సమస్య వంటిదే కార్తి తమిళ సినిమా ‘వా వాతియార్’ (తెలుగులో అన్నగారు వస్తున్నారు)కి సమస్య ఎదురైంది. డిసెంబర్ 12న అన్నగారు థియేటర్లలోకి రావాల్సి ఉండగా మద్రాస్ హైకోర్టు స్టే విధించడంతో ఆగిపోక తప్పలేదు.
నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకి ఫైనాన్స్ చేసిన అర్జున్ లాల్ సుందర్ దాస్‌కు వడ్డీతో కలిపి మొత్తం 21.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించలేదు. కనుక సుందర్ దాస్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సినిమా రిలీజ్ చేయకుండా స్టే విధించింది.
అంతకు ముందే న్యాయస్థానం ఆయనకు నోటీసులు పంపించి బకాయిలు క్లియర్ చేయకపోతే స్టే తొలగించబోమని స్పష్టం చేసింది కూడా. అలాగే సుందర్ దాస్ కూడా పదేపదే బకాయిల చెల్లించాలని నిర్మాత జ్ఞానవేల్ రాజాని అడుగుతూనే ఉన్నారు. కానీ ఏడుసార్లు అవకాశాలు ఇచ్చినా ఆయన బకాయిలు క్లియర్ చేయకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు.
సినిమాపై స్టే విధించడంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా హడావుడిగా కోర్టులో పిటిషన్ వేసి, తాను తక్షణమే రూ.3.75 కోట్లు చెల్లిస్తానని, మిగిలిన బకాయిలకు తన చరాస్తుల పత్రాలు సమర్పిస్తానని అభ్యర్ధించారు. కానీ కోర్టు అంగీకరించలేదు.
తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సినిమా విడుదల చేయరాదని, అలాగే ఓటీటీ లేదా మరో మాధ్యమంలో కూడా సినిమా విడుదల చేయడానికి వీల్లేదని ఆదేశించింది. కనుక రేపు అన్నగారు రావడం లేదు.