షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన డా.రాజశేఖర్

ప్రముఖ నటుడు డా.రాజశేఖర్ సోమవారం మేడ్చల్ సమీపంలో ఓ సినిమా షూటింగ్‌ యాక్షన్ సీన్‌లో నటిస్తునప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కుడికాలు మడమ వద్ద ఎముక విరిగింది. వెంటనే ఆయనని హైదరాబాద్‌లో ఓ ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు సుమారు 3 గంటల సేపు శస్త్ర చికిత్స చేసి మడమ దగ్గర విరిగి బయటకు వచ్చిన ఎముకని మళ్ళీ దాని స్థానంలో అమర్చారు. దీని కోసం ఎముకకి ప్లేట్స్ వేసి బిగించాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఆయన మూడు-నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డా.రాజశేఖర్ వారం రోజులు హాస్పిటల్లో ఉండి అవసరమైన వైద్యం పొందిన తర్వాత డిశ్చార్జ్ అవుతారు. 

సుమారు 35 ఏళ్ళ క్రితం అంటే నవంబర్‌,1989లో ఆయన ‘మగాడు’ సినిమా షూటింగ్‌లో ఇదేవిధంగా తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు ఎడమకాలి ఎముక విరిగితే ఇదేవిధంగా మేజర్ ఆపరేషన్ చేయాల్సివచ్చింది.