అఖండ పుకార్లు వద్దు... సురేష్ బాబు

బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో భారీ అంచనాలతో నేడు విడుదల కావాల్సిన అఖండ-2 ఆర్ధిక లావాదేవీలలో వివాదం ఏర్పడి మద్రాస్ హైకోర్టు జోక్యంతో నిలిచిపోయింది. దానిపై అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ సైక్ సిద్ధార్థ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు భిన్నంగా స్పందించారు. 

“ప్రతీ సినిమాకి ఆర్ధిక లావాదేవీలు, ఆర్ధిక సమస్యలు తప్పక ఉంటాయి. కనుక మేము వాటన్నిటినీ అధిగమించి సినిమా విడుదల చేసేందుకు కృషి చేస్తుంటాము. అఖండ-2 విషయంలో కూడా ఇలాంటి సమస్యే ఏర్పడింది. అయితే ఆర్ధిక పరమైన సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటం సరికాదు. ముఖ్యంగా సమస్య గురించి తెలిసీ తెలియకుండా మాట్లాడటం అసలే మంచిది కాదు. 

ఈ సమస్యని పరిష్కరించేందుకు తెర వెనక చాలా మంది ప్రయత్నిస్తున్నాను. నేను కూడా దాని కోసమే వెళ్ళడంతో ఈ కార్యక్రమానికి రావడం కాస్త ఆలస్యమైంది. కానీ త్వరలోనే ఈ సమస్య తప్పక పరిష్కారం అవుతుందని నాకు నమ్మకం ఉంది,” అని సురేష్ బాబు అన్నారు.