
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అఖండ-2 నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసి ఉంది. కానీ అనివార్య కారణాల వలన సినిమా వాయిదా పడిందని త్వరలోనే మరో తేదీ ప్రకటిస్తామని 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది. ఆర్ధిక లావాదేవీల విషయంలో నిర్మాతకు, తమిళనాడులో ఓ సినీ సంస్థకు వివాదం ఏర్పడటం, మద్రాస్ హైకోర్టులో కేసు నమోదయ్యింది.
కనుక మద్రాస్ హైకోర్టు తీర్పు వస్తే కానీ ఈ సినిమా తమిలా వెర్షన్ విడుదల చేయడం కష్టం. తెలుగుతో సహా మిగిలిన భాషలలో, విదేశాలలో అఖండ-2 రిలీజ్ చేసుకోవచ్చు. కానీ దాని వలన తమిళ వెర్షన్ కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పైరసీ కాపీలు మార్కెట్లోకి వచ్చేస్తే సినిమా దెబ్బ తింటుంది.
కనుక మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడ్డాక లేదా ఈలోగా చెన్నైలోని సినీ సంస్థతో కోర్టు బయట రాజీ చేసుకుంటే తప్ప అఖండ-2 విడుదల చేయడం కష్టం. ఇప్పటికే ఆ ప్రయత్నాలు మొదలయ్యాయి. కనుక ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కుదిరితే ఈ నెల 19న లేదా 25న (క్రిస్మస్) విడుదల చేయాలని బాలయ్య, దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారు అధికారికంగా ప్రకటిస్తే తప్ప అఖండ-2పై పూర్తి స్పష్టత రాదు.