
ప్రముఖ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఎం.శరవణన్ (86) గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిన్న (బుధవారం) ఆయన పుట్టిన రోజు జరుపుకున్నారు.
శరవణన్ తండ్రి పేరు ఏవీ మెయప్పన్. ఆయన దేశానికి స్వాతంత్ర్యం రాక ముందే అంటే 1945లోనే ఏవీఎం ప్రొడక్షన్స్ స్థాపించారు. కోలీవుడ్ టాప్ హీరోలు ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారందరూ ఈ బ్యానర్లో అనేక సినిమాలు చేసి పాపులర్ అయ్యారు.
తండ్రి తర్వాత ఏవీఎం ప్రొడక్షన్స్ బాధ్యతలు చేపట్టిన శరవణన్ తెలుగు, తమిళ్, కన్నడ హిందీ భాషల్లో 300కి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో సంసారం చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, లీడర్ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు అందించారు.
శరవణన్ వయసు మీద పడటంతో ఏవీఎం ప్రొడక్షన్స్ బాధ్యతలను ఆయన కుమారుడు ఎంఎస్. గుహన్ చేపట్టారు. శరవణన్ మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.