
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు...’ సంక్రాంతి పండగకి వస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నటిస్తూనే ఉన్నారు. కానీ నేటికీ అయన పారితోషికం ఎంతో ఎవరికీ తెలియదు. ఎందుకంటే, దాని కోసం పట్టుబట్టరు. నిర్మాతలే ఆయన ఇమేజ్, సినిమా బడ్జెట్ చూసుకొని రూ.35-40-50 కోట్లు వరకు ఇస్తుంటారు.
కానీ చిరంజీవి తొలిసారిగా ఈ సినిమాకు రూ.70-75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తాజా సమాచారం. ఇది కామెడీ కింగ్స్ చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్లో తీస్తున్న సినిమా కనుక దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఓటీటీ సంస్థలు, విదేశీ బయర్స్ కూడా దీని డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. సినిమా బిజినెస్ బాగుంది. సంక్రాంతికి విడుదలవుతోంది. సూపర్ డూపర్ హిట్ పక్కా... అని టాక్ సంపాదించుకుంది. కనుక చిరంజీవికి ఆ పారితోషికం తక్కువే కానీ ఎక్కువ కానే కాదని చెప్పవచ్చు.
డిసెంబర్ మొదటి వారం నుంచి వెంకటేష్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 14న సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది.