
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఎప్పుడూ వార్తలలో ఉంటుంది. పుష్ప-2 విడుదల సందర్భంగా తొక్కిసలాట , తదనంతర పరిణామాలతో సంధ్య థియేటర్ పేరు రాష్ట్రమంతా మారుమ్రోగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. అయితే ఈసారి థియేటర్ యాజమాన్యం తప్పేమీ లేదు.
కొందరు యువకులు థియేటర్ ఆవరణలో ‘సినిమా టికెట్ ధరలు, థియేటర్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ధరలు తగ్గించాలను ఓ బోర్డు పెట్టారు. సంధ్య థియేటర్లో సినిమా చూసేందుకు వస్తున్న ప్రేక్షకులను దానిపై సంతకాలు చేసి తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరసాగారు.
ఇందుకు థియేటర్ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో ఇరుపక్షాల మద్య వాగ్వాదాలు మొదలయ్యాయి. థియేటర్ సిబ్బంది ఆ బోర్డు బయట పెట్టుకొని ఆందోళన చేసుకోవాలని, లేదా కోర్టులో కేసు వేసుకోమని చెప్పడంతో ఆ యువకులు ఆగ్రహంతో సంధ్య థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు అక్కడకు చేరుకొని ఆ యువకులను అక్కడి నుంచి పంపించి వేశారు.