
మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. చాలా రోజుల తర్వాత మంచి హిట్ పడటంతో రామ్ పోతినేని చాలా సంతోషంగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
తాను చిన్నప్పుడు మద్రాస్ (చెన్నై)లో ఉండేవాడినని, అప్పుడు రజినీకాంత్ సినిమాలంటే చాలా ఇష్టపడేవాడినని చెప్పారు. ఆయన సినిమా ఒకటి వంద రోజులు పండగ జరుపుకున్నప్పుడు, థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం చూసి చాలా ఆశ్చర్యపోయానన్నారు.
ఆ సినిమా అప్పటికే వంద రోజులు ఆడింది. కనుక అభిమానులు చాలాసార్లు చూసి ఉంటారని, అయినా వందో రోజు మళ్ళీ అందరూ రజినీకాంత్ సినిమా చూడటం చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. చిన్నప్పుడు చూసిన రజినీ అభిమానుల స్ఫూర్తితోనే ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా తీశానని చెప్పారు.
ఈ సినిమా కోసం వ్రాసిన ప్రేమ గీతం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే నేను, భాగ్యశ్రీ ప్రేమలో పడ్డామనే పుకార్లు మొదలయ్యాయి. ఈ సినిమాకి ఆ ప్రేమ గీతం వ్రాసినప్పటి నుంచి అది ఆమె కోసమే వ్రాశానని, అందుకే ఆ పాటలో మా ఇద్దరి కెమిస్ట్రీ అంత అద్భుతంగా ఉందని వాదనలు వినిపించాయి.
ప్రేమించకుంటే ప్రేమ గురించి అంత గొప్పగా ఎలా వ్రాయగలడు?అనే ప్రశ్న పదేపదే వినిపించింది. కానీ నేను మనసులో హీరో, హీరోయిన్ రొమాంటిక్ సాంగ్ ఎలా ఉండాలో ఊహించుకొని వ్రాశాను. అంతే!” అని అన్నారు.