
‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలతో మంచి దర్శకుడుగా గుర్తింపు సంపాదించుకున్న వేణు ఊడుగుల, నిర్మాతగా మారి తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చక్కటి ప్రేమ కధ తీశారు. ఇది వరంగల్-ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కధ. సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటించారు. శివాజీ రాజ, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం ముఖ్యపాత్రలు చేశారు.
నవంబర్ 21న ఈ సినిమా విడుదలకాగా మొదటి షోకే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎటువంటి అంచనాలు, పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో మరో వంద థియేటర్లలో విడుదల చేశారు. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్గా నడుస్తున్నాయి.
మొదటి రెండు రోజులలోనే ఈ సినిమా మొత్తం రూ.4.౦౪ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. వాటిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రూ.1.47 కోట్లు రాగా ఇతర రాష్ట్రాలలో మూడు కోట్లు రావడం విశేషమే కదా? విదేశాలలో కూడా రాజు వెడ్స్ రాంబాయికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. అక్కడ కూడా హౌస్ ఫుల్గా నడుస్తోంది.
దర్శకుడు సాయిలు కంపాటికి ఇదే తొలి సినిమా. దీనిలో నటించినవారిలో చాలా మంది కొత్తవారే. అయినా ప్రేక్షకులను ఆకట్టుకునే కధ, కధనంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.