
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్లో ‘స్పిరిట్’ గురించి చాలా రోజులుగానే వింటూనే ఉన్నాము. ఎట్టకేలకు నేడు (ఆదివారం) హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. దర్శకుడు సందీప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యి, క్లాప్ కొట్టి లాంచనంగా షూటింగ్ ప్రారంభించారు.
ఈ సినిమాని కూడా 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు. కనుక ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన భూషణ్ కుమార్ కూడా హాజరయ్యారు. కానీ అనివార్య కారణాల వలన ప్రభాస్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్న త్రిప్తి డిమ్రీ మాత్రం హాజరయ్యారు.
ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ సినిమాని జపనీస్, కొరియన్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. కనుక దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు మా డాంగ్ సియోక్ ఈ సినిమాలో విలన్ పాత్రలో చేయబోతున్నట్లు సమాచారం.
దర్శకుడు సందీప్ రెడ్డి మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్, మెక్సికోలో పర్యటించి లొకేషన్స్ ఫైనల్ చేశారు. కనుక మొదట అక్కడే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
‘స్పిరిట్’కి కోసం సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ కామేశ్వర్ ఇటీవల ఓ విలేఖరి ప్రశ్నకు జవాబుగా ఇప్పటికే 70 శాతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తయిందని, రెండు పాటలు కూడా రికార్డ్ చేశామని చెప్పారు.
టీ సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ప్రణయ రెడ్డి వంగా కలిసి స్పిరిట్ నిర్మిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.