వచ్చే నెల నుంచి వెంకీ-త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌ షురూ?

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ వచ్చే నెల రెండో వారం నుంచి మొదలవబోతోంది. వెంకటేష్‌ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. అది ఈ నెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటివారంలో పూర్తవుతుంది. వెంటనే త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెడతారు. 

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. గతంలో వెంకటేష్‌ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్,’ ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటల రచయితగా చేశారు. ఇద్దరికీ కామెడీ మీద మంచి పట్టుంది. కనుక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. కనుక వచ్చే ఏడాది వేసవిలోనే ఈ సినిమా విడుదల చేసినా ఆశ్చర్యం లేదు.