
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో వచ్చిన వార్-2 సినిమా గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రసారం అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది.
బాలీవుడ్లో పేరుమోసిన యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థ వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో దీనిని పాన్ ఇండియా మూవీగా తీసింది. కానీ ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించలేకపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది కనుక కనీసం ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.
ఒక మాజీ రా ఏజంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశానికి వ్యతిరేకంగా ఓ అంతర్జాతీయ గ్యాంగ్‌తో చేతులు కలిపి, ఒకప్పుడు తన గాడ్ ఫాదర్ సునీల్ లూద్ర (అశుతోష్ రాణా)ని హత్య చేస్తాడు. దాంతో కబీర్ ఆట కట్టించేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్) నేతృత్వంలో సోల్జర్ విక్రం చలపతి (జూ. ఎన్టీఆర్) బృందం రంగంలో దిగుతుంది.
ఈ ఇద్దరు తెలివైన, శక్తివంతులైన ఏజంట్ల మద్య జరిగే యుద్ధమే వార్-2. సినిమా ఆద్యంతం ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ, కధ కంటే అవే ముఖ్యమన్నట్లు తీయడంతో అవి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. సినిమా బోర్లా పడటానికి ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి.