
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ దేశం మీద బాంబులు వేస్తూ యుద్ధం మొదలుపెట్టలేదు. కానీ ఆయన దూకుడు చూసి యావత్ ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్నాయి. సుంకాలు, విదేశీ విద్యార్ధులు, హెచ్-1బీ వీసాల తర్వాత ట్రంప్ దృష్టి విదేశీ సినిమాలపై పడింది. అంతే అమెరికా బయట తీస్తున్న సినిమాలపై 100 శాతం సుంకాలు విధించబోతున్నట్లు తన ‘ట్రూత్’ సోషల్ మీడియాలో ప్రకటించేశారు. ట్రంప్ మాటే శాసనంగా మారింది కనుక నేడో రేపో ఈ సుంకాల వడ్డింపు మొదలవుతుంది.
భారతీయ సినీ పరిశ్రమపై ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్నేళ్ళుగా అమెరికాలో తెలుగుతో సహా భారతీయ సినిమాలు ప్రదర్శించే థియేటర్ల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పుడు పెద్ద సినిమాలు ఒక్క అమెరికాలోనే ‘వెయ్యి స్క్రీన్స్’లో ప్రదర్శించే స్థాయికి ఎదిగిపోయాయి. కనుక వాటి కలక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే లక్షల డాలర్లలో ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఒకే ఒక్క సంతకంతో ‘జీరో కలక్షన్స్’ చేసేయబోతున్నారు.
ఒకవేళ అమెరికాలో భారతీయ, విదేశీ సినిమాల ప్రదర్శన నిలిచిపోతే వందల కొద్దీ థియేటర్లు ఆ మేరకు నష్టపోతాయి. అలాగని హాలీవుడ్ ఈ లోటుని ఎన్నటికీ భర్తీ చేయలేదు... థియేటర్ల యజమానులకు ట్రంప్ ఆర్ధిక సాయం చేయరు. కనుక ఈ ఒక్క దెబ్బతో అమెరికాలో ఎన్ని థియేటర్స్ మూతపడతాయో?