కల్కి-2 దీపికా అవుట్!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌ హాసన్‌ వంటి హేమాహేమీలు నటించిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌ షూటింగ్‌ ఈ ఏడాది చివరిలోగా షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది. షూటింగ్‌ సమయం దగ్గరపడుతున్న ఈ సమయంలో వైజయంతీ మూవీస్ సంచలన ప్రకటన చేసింది. 

కల్కి మొదటి భాగంలో కీలకపాత్ర చేసిన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొనేని సీక్వెల్‌ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. “కల్కి మొదటిభాగంలో ఆమె మాతో చాలా కాలం కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.

కల్కి-2 వంటి పెద్ద సినిమాకు చాలా నిబద్దత అవసరం. దురదృష్టవశాత్తు ఆమె నుంచి అటువంటి స్పందన కనిపించడం లేదు. కనుక కల్కి-2లో ఆమె భాగస్వామి కాబోరని అధికారికంగా తెలియజేస్తున్నాము,” అని వైజయంతీ మూవీస్ సంచలన ప్రకటన చేసింది.   

మరో విషయం ఏమిటంటే ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తీస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి కూడా ఆమెను బయటకు పంపించేశారు. ఆమె ఈ సినిమా ఒప్పుకున్నాక ఏడాది వయసున్న తన కూతురు ఆలనాపాలనా చూసుకోవడానికిగాను రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయగలనని చెప్పడంతో ‘స్పిరిట్’ కూడా ఆమె చేజారిపోయింది. బహుశః ఇటువంటి షరతుల కారణంగానే కల్కి-2 నుంచి కూడా దీపికని తప్పించి ఉండవచ్చు.   

కానీ అల్లు అర్జున్‌-అట్లీ కాంబినేషన్‌లో సుమారు రూ.700-1000 కోట్ల భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమాలో ఆమె అవకాశం దక్కించుకున్నారు. కానీ ఆ సినిమాకు ఇటువంటి షరతులే విధిస్తే అది కూడా ఆమె చేజారిపోయే అవకాశం ఉంది. 

కల్కిలో దీపిక పడుకొనే విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కికి జన్మనివ్వబోయే మాతృమూర్తిగా నటించారు. కానీ ఇప్పుడు ఆమెను తప్పించడంతో ఆమె స్థానంలో మరొకరిని తీసుకొని, తదనుగుణంగా ఆమె పాత్రని, కాదని కూడా మార్చాల్సివస్తుంది.