త్వరలో స్పిరిట్ షూటింగ్‌ షురూ: సందీప్

ప్రభాస్‌-సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ గురించి చాలా రోజులుగానే వింటున్నాము. కానీ ప్రభాస్ ‘రాజాసాబ్’తో లాక్ అయిపోవడం వలన ఇంతకాలం ఈ సినిమా మొదలవలేదు. కానీ స్పిరిట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కనుక అతి త్వరలోనే స్పిరిట్ షూటింగ్‌ మొదలుపెడతామని సందీప్ వంగా చెప్పారు. 

ఇప్పటికే ‘స్పిరిట్’ కోసం 70 శాతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తయిందని, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ కామేశ్వర్ రెండు పాటలు కూడా రికార్డ్ చేశారని చెప్పారు. 

ఇప్పటికే సందీప్ రెడ్డి మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్, మెక్సికోలో పర్యటించి లొకేషన్స్ ఫైనల్ చేశారు. కనుక అక్కడే  షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది. 

భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ప్రణయ రెడ్డి వంగా కలిసి దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియాలో కూడా ఈ సినిమా విడుదల చేసేందుకు వీలుగా జపనీస్, కొరియన్ భాషల్లో కూడా డబ్ చేయబోతున్నారు. 

ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటించబోతున్నారు. ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి దిమ్రీ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు మా డాంగ్ సియోక్ చేయబోతున్నట్లు సమాచారం.  

సినిమా షూటింగ్‌ ప్రారంభించే ముందు పూర్తి వివరాలు తెలియజేస్తానని సందీప్ రెడ్డి చెప్పారు.