
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధానపాత్ర చేసిన ‘ఘాటి’ సినిమా కధాంశంపై తెలంగాణ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ సినిమాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగం వంటి అంశాలను చూపారని, కానీ ట్రైలర్‌లో వాటిపై ఎటువంటి హెచ్చరికలు పెట్టకపోవడాన్ని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తప్పు పట్టారు.
ఇటువంటి అంశాలతో సినిమా తీస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇవి నిషేదించబడినవి, చట్ట విరుద్దమైనవని తెలియజేస్తూ హెచ్చరికలు పెట్టాలని కానీ సినిమా ట్రైలర్‌లో అటువంటి హెచ్చరికలు ఏవీ కనపడలేదన్నారు.
ఇటువంటివి సమాజం మీద ముఖ్యంగా పిల్లలు, యువత మీద తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. కనుక ఘాటిలో గంజాయి సాగు, సరఫరా, వినియోగానికి సంబందించిన దృశ్యాలు తొలగించాలని దర్శక నిర్మాతలకు సందీప్ శాండిల్య విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సాధ్యం కాదనుకుంటే ఆ సన్నివేశాలలో తప్పనిసరిగా హెచ్చరికలు పెట్టాలని కోరారు.
కానీ ప్రతీ సినిమాని ముందుగా సెన్సార్ బోర్డు పరిశీలించి సెన్సార్ చేస్తుంటుంది కనుక ఇటువంటి అంశాలను అదే తొలగించి ఉండాలి లేదా సందీప్ శాండిల్య చెప్పినట్లుగా అభ్యంతరకర సన్నివేశాలలో తప్పనిసరిగా హెచ్చరికలు పెట్టాలని దర్శక నిర్మాతలకు చెప్పవచ్చు. కానీ సెన్సార్ బోర్డు ఇటువంటి కధాంశాలున్న సినిమాలకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసి చేతులు దులుపుకుంటుంది.
కనుక సెన్సార్ సర్టిఫికేట్ పొంది సినిమా రిలీజ్ అవుతున్నవేళ ఈవిదంగా అభ్యంతరాలు చెప్చెపే బదులు ఈగల్ సంస్థ సెన్సార్ బోర్డుతోనే మాట్లాడి ఇటువంటి నిబంధనలు అమలు చేయిస్తే బాగుంటుంది కదా?